Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జలమండలి రీడర్ కిరణ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

Author
Posted By AKSHARA NETRAM
| 15 Sep 2026, 11:50 PM |
జలమండలి రీడర్ కిరణ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

జలమండలి రీడర్ కిరణ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల ఆర్థిక సహాయం
ఉద్యోగ భద్రత కల్పించాలి.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
హైదరాబాద్: జలమండలిలో రీడర్‌గా పనిచేస్తున్న కిరణ్ మృతి పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, తన సొంత నిధుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగం పోతుందనే మనస్తాపంతో కిరణ్ గుండెపోటుకు గురై మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మహానగర జలమండలిలో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారిలో 673 మంది రీడర్లను తొలగించేందుకు జలమండలి శాఖ ఆదేశాలు జారీ చేయడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు. 23 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేసిన కిరణ్ కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అనే ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో జలమండలి ఉద్యోగుల జీతాలను రూ.19,500కు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా జీతాలు పెంచకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించడం సిగ్గుచేటని మాధవరం కృష్ణారావు విమర్శించారు.
జలమండలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎండీ అశోక్ రెడ్డి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించకపోతే సీఎం రేవంత్ రెడ్డి, జలమండలి కార్యాలయాల ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు ఎవరూ మనస్తాపానికి గురికావద్దని, రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు బిక్షపతి, సీనియర్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.