రౌడీషీటర్ అరెస్ట్.. కత్తితో బెదిరించి రూ.20 వేల డిమాండ్.. నాలుగు కత్తులు స్వాధీనం.
*
: కత్తితో బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేసిన రౌడీషీటర్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌నగర్ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ అలియాస్ చంగో (25) సెంట్రింగ్ కూలీ, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిపై గతంలో పలు ఆస్తి సంబంధిత, దాడులు, ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 4న రాత్రి 8 గంటల సమయంలో నిందితుడు నూర్ జహాన్ బేగం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, ఆమె కుమారుడు అబ్దుల్ రెహమాన్ గొంతుపై కత్తి పెట్టి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా కత్తితో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సెప్టెంబర్ 13న ఫిర్యాదు అందడంతో అత్తాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 997/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 308(4), 329(4), 352, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1)(A) కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 12 గంటల్లోనే అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తును అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య పర్యవేక్షణలో ఎస్‌ఐ నిరంజన్ మహమ్మద్ హుస్సేన్ చేపడుతున్నారు.