పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు.
పికెట్‌లోని కార్ఖానా, పికెట్, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో 9 రేషన్ షాపుల పరిధిలోని 9,156 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు కీలకమైన పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.