మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
మేడ్చల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని షాపూర్‌లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు డి. గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ వినాయక చవితి ప్రజలందరిలో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం పూజా కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులకు వడ్డేపల్లి రాజేశ్వరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.