కులమతాలకు అతీతంగా వినాయక భక్తి వినాయక మండపంలో ఖలీల్‌ను సన్మానించిన దొడ్ల వెంకటేష్ గౌడ్
కుత్బుల్లాపూర్: వినాయక చవితి శుభసందర్భంగా ఎల్లమ్మబండ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఎల్లమ్మబండ వినాయక భక్త బృందానికి 21 కిలోల లడ్డును అందిస్తున్న ఎం.డి. ఖలీల్‌ను దొడ్ల వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు.
కులమతాలకు అతీతంగా గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం అందిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ముస్లిం సోదరుడు ఖలీల్ సేవలను వెంకటేష్ గౌడ్ ప్రశంసించారు. ఇలాంటి సోదరభావం, పరస్పర గౌరవం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందించేలా జరగాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శశిధర్ పట్వారీ, చిన్నోళ్ల శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, సంపత్, కటిక రవి, దుర్గేశ్, భవాని, శ్రీకాంత్, యాకయ్య, కృష్ణ, పృథ్వీ, రాము, రవీందర్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.